భూకబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

  • మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 420 చీటింగ్ కేసు  
  • ఆ భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఈ అంశంపై తాను కోర్టును ఆశ్రయిస్తానన్న మల్లారెడ్డి
  • తనపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కాదన్న మల్లారెడ్డి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. మూడుచింతలపల్లిలో తాను కబ్జాకు పాల్పడినట్లు వస్తున్నదంతా అవాస్తవమని తెలిపారు. 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని, ఈ అంశంపై తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కొంతమంది వ్యక్తులు భూముల కొనుగోలు... అమ్మకాలు జరుపుతున్నారని, వారిలో ఎవరో కబ్జా చేసి ఉంటారన్నారు. ఈ వ్యవహారంలో తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తాను అయితే భావించడం లేదని స్పష్టం చేశారు. 47 ఎకరాల భూమికి సంబంధించి ఎక్కడా తన పేరు లేదన్నారు. తాను రాత్రికి రాత్రి దానిని కబ్జా చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, స్నేహా రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు 420 చీటింగ్ కేసు నమోదయింది.


More Telugu News