తెలంగాణ ఉద్యమంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. స్పీకర్ స్థాయికి ఎదిగిన గడ్డం ప్రసాద్!

  • టీఎస్ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
  • ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వైనం
  • కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్న ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా ఆయన కాసేపటి క్రితం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం సభలో కొత్త స్పీకర్ ను అభినందించే కార్యక్రమం కొనసాగుతోంది. 

మరోవైపు, 2008లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు. 

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో 2012లో టెక్స్ టైల్ శాఖ మంత్రిగా గడ్డం ప్రసాద్ సేవలందించారు. 2018 తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం, మర్పల్లి కల్యాణ్ గ్రామంలో ఆయన జన్మించారు. తాండూర్ లో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయనకు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.


More Telugu News