తప్పు చేస్తే నా కొడుకును ఉరితీయండి.. పార్లమెంటులో కలకలం సృష్టించిన నిందితుడి తండ్రి

  • కొడుకు తప్పు చేస్తే ఖండిస్తానన్న మనోరంజన్ తండ్రి దేవరాజ్
  • సమాజానికి హాని కలిగించడం సరికాదని ఖండన
  • లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనపై స్పందన
బుధవారం లోక్‌సభలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్‌లోకి దూకి కలకలం సృష్టించిన దుండగులు సాగర్ శర్మ, మనోరంజన్‌‌లను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ స్పందించారు. తప్పు చేస్తే తన కొడుకుని ఉరి తీయాలని అన్నారు. తన కొడుకు మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని, తప్పు చేస్తే ఖండిస్తానని తేల్చిచెప్పారు. లోక్‌సభలో చొరబాటుకు సంబంధించి తన కొడుకు చేసింది తప్పేనని అన్నారు. సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించడం సరికాదని, శిక్షించాలని అన్నారు. లోక్‌సభలో మనోరంజన్ దాడికి పాల్పడడంపై ప్రశ్నించగా ఆయన ఈ విధంగా స్పందించారు.

కాగా బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న సాగర్ శర్మ, మనోరంజన్ ఛాంబర్‌లోకి దూకి కలకలం రేపారు. పసుపు రంగు పొగని వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశారు. ఎంపీలు కూర్చునే బెంచీల మీద నుంచి దూకుతూ స్పీకర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News