లోక్‌సభ ఛాంబర్‌లో కలకలానికి ముందు దుండగుడు సాగర్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ లో సంచలన పోస్టు

  • గెలిచినా, ఓడినా ప్రయత్నం ముఖ్యమని పోస్టు పెట్టిన సాగర్
  • అందరినీ మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నట్టు పేర్కొన్న దుండగుడు
  • నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాడని చెప్పిన కుటుంబ సభ్యులు
లోక్‌సభలో బుధవారం ఇద్దరు దుండగులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. విజిటర్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ‌లోకి దూకి భయభ్రాంతులకు గురిచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరిద్దరినీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దుశ్చర్యకు ముందు చొరబాటుదారుల్లో ఒకరైన సాగర్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టాడు. గెలిచినా లేక ఓడినా ప్రయత్నించడం ముఖ్యమని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ‘‘చూద్దాం, ఈ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో. మీ అందర్నీ మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నాను’’ అంటూ వ్యాఖ్యానించాడు. 

కాగా ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సాగర్‌ రెండు రోజుల క్రితం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పార్లమెంటులో కలకలానికి సంబంధించి సాగర్ ప్రమేయానికి సంబంధించి తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాగర్ ఇటీవలే బెంగళూరు నుంచి లక్నోకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అతడు ఈ-రిక్షా నడిపేవాడని తెలిసిందన్నారు. సాగర్ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాకు చెందినదని పేర్కొన్నారు.

కాగా.. 2001 పార్లమెంటు ఉగ్రదాడి వార్షికోత్సవం రోజునే సాగర్ శర్మతోపాటు మనోరంజన్ అనే వ్యక్తి లోక్‌సభలో బుధవారం భద్రత ఉల్లంఘనకు పాల్పడ్డాడు. సభ జీరో అవర్‌ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. డబ్బాల నుంచి పసుపు వాయువు విడుదల చేసి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.


More Telugu News