భారత్‌పై బహిరంగ విమర్శలకు కారణం చెప్పిన కెనడా ప్రధాని

  • భారత్‌ను కట్టడి చేసేందుకు నిజ్జర్ హత్యపై బహిరంగ ఆరోపణలు చేశామన్న ట్రూడో
  • నిజ్జర్ హత్య తరువాత కెనడా వాసుల్లో భద్రతాపరమైన ఆందోళన నెలకొందని వెల్లడి
  • అంతకుమునుపే ఈ విషయాన్ని భారత్‌ దృష్టికి తీసుకెళ్లామని వ్యాఖ్య
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో బహిరంగ విమర్శలకు దిగడంపై తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. భారత్ మరోసారి ఇలాంటి చర్యలకు దిగకుండా బహిరంగంగా ఆరోపణలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

హర్దీప్ సింగ్ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా పార్లమెంట్ వేదికగా జస్టిన్ ట్రూడో ఆరోపించడం కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. కెనడా ఆరోపణలు అర్థరహితమంటూ భారత్ మండిపడింది. ఓ దశలో భారత‌లోని కెనడా దౌత్యవేత్తలను కేంద్రం వెనక్కు పంపించేసింది. కెనడా వీసాల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.
 
ఈ అంశాలపై జస్టిన్ ట్రూడో తాజాగా స్పందించారు. నిజ్జర్ హత్య తరువాత కెనడావాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. దేశవాసుల భద్రత కోసం భారత్‌కు అదనంగా మరో అడ్డుకట్ట వేసేందుకు బహిరంగ ఆరోపణలు చేయాల్సి వచ్చిందన్నారు. అంతకుమునుపే భారత్‌తో దౌత్యపరమైన చర్చలు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. 

‘‘దీని గురించి భారత్‌తో చర్చలు క్లిష్టమైనవని మాకు తెలుసు. జీ20కి ఆతిథ్యమిస్తున్న భారత్‌కు అది ఓ ముఖ్యమైన సందర్భమని తెలుసు. అయితే, ఈ సమయాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించాలన్న ఆలోచన చేశాం’’ అని ట్రూడో చెప్పుకొచ్చారు. ఈ విషయం ఏదో ఒక రోజున మీడియా ద్వారా బయటకు వస్తుందని భారత్‌ను హెచ్చరించామని కూడా పేర్కొన్నారు. అయితే, కెనడా తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి గత వారం రాజ్యసభలో పేర్కొన్నారు.


More Telugu News