నెలసరిలో మహిళలకు జీతంతో కూడిన సెలవులు అవసరం లేదు: స్మృతీ ఇరానీ

  • నెలసరి రోజుల్లో మహిళలకు సెలవుల జారీపై రాజ్యసభలో ప్రశ్న
  • నెలసరి వైకల్యం కాదని స్మృతి ఇరానీ వ్యాఖ్య
  • మహిళల జీవన ప్రయాణంలో అదో భాగమని వివరణ
  • ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టీకరణ
ఓ మహిళగా తన దృష్టిలో నెలసరి అంటే ఓ సహజ ప్రక్రియ అని, వైకల్యం కాదని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. నెలసరి రోజుల్లో మహిళలకు సెలవులపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ‘‘నెలసరి అనేది ఓ సహజ ప్రక్రియ.. అదేమీ వైకల్యం కాదని ఓ మహిళగా నేను చెప్పదలుచుకున్నాను’’ అని ఆమె తెలిపారు.  ‘మహిళ జీవన ప్రయాణంలో అదొక భాగం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సమానావకాశాలకు మహిళలను దూరం చేసే ప్రతిపాదనలు చేయకూడదు’’ అని మరో ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 

నెలసరి సహజ ప్రక్రియ అని, కొందరు మహిళలకు ఆ సమయంలో శారీరక బాధలు ఉన్నా మందులతో ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అయితే, ఈ అంశంపై సమాజం ఇప్పటికీ మౌనంగానే ఉంటోందని, ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. 

మహిళా ఉద్యోగులకు నెలసరిలో జీతంతో కూడిన సెలవులు మంజూరు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ఏదైనా ఉందా? అని ఎంపీ శశిథరూర్ గతవారం లోక్‌సభలో ప్రశ్నించారు. అయితే, అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్మృతి పేర్కొన్నారు.


More Telugu News