ప్రార్థన చేయడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తే నేను భారత్‌లో ఎందుకు ఉంటాను?: మహ్మద్ షమీ

  • వరల్డ్ కప్‌లో శ్రీలంకపై మ్యాచ్‌లో మైదానంలో మోకరిల్లడంపై స్పష్టత నిచ్చిన షమీ
  • అలసిపోవడంతో మైదానంలో మోకరిల్లానని వెల్లడి
  • ప్రార్థన చేయాలనుకుంటే తనను ఎవరు ఆపుతారన్న స్టార్ పేసర్
  • ముస్లింగా, భారతీయుడిగా గర్వపడుతున్నానని స్పష్టం చేసిన షమీ

భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2023 లీగ్ దశలో శ్రీలంకపై మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో 5వ వికెట్ తీసిన తర్వాత షమీ గ్రౌండ్‌లో మోకరిల్లాడు. దీనిపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. షమీ మైదానంలో ప్రార్థన (సజ్దా) చేశాడంటూ కొందరు, ధైర్యంగా ప్రార్థన చేయలేకపోయాడంటూ పాకిస్థాన్‌కు చెందిన నెటిజన్లు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని బుధవారం ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా షమీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. 

తాను ఒక ముస్లింగా, భారతీయుడిగా గర్వపడుతున్నానని పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. తాను భారతీయ ముస్లింనని, ప్రార్థన చేయాలనుకుంటే తనను ఎవరు ఆపుతారని చెప్పాడు. తాను వేరే మతం వారిని ఆపబోనని, వారు తనను ఆపబోరని, ప్రార్థన చేయాల్సి వస్తే చేస్తానని, ఇందులో సమస్య ఏమిటని షమీ ప్రశ్నించాడు. తనకు ఏదైనా సమస్య ఉంటే ఇండియాలో నివసించను కదా? అని చెప్పాడు. ప్రార్థన చేయడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తే తాను ఇక్కడెందుకు ఉంటానని గట్టి కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ తరహా వ్యాఖ్యలను చూశానని ప్రస్తావించాడు. తాను ఎప్పుడైనా మైదానంలో ప్రార్థన చేశానా అని ప్రశ్నించాడు. తాను ఇంతకు ముందు కూడా 5 వికెట్లు తీశానని, కానీ ప్రార్థన చేయలేదని పేర్కొన్నాడు.

శ్రీలంకపై మ్యాచ్‌లో తన శక్తికి మించి బౌలింగ్ చేశానని, బాగా అలసిపోవడంతో మోకరిల్లానని షమీ స్పష్టత నిచ్చాడు. అనవసర వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించే వ్యక్తులకు దూరంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. కాగా మహ్మద్ షమీ ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు జట్టుతో కలవాలని భావిస్తున్నాడు.


More Telugu News