నిరుద్యోగంలో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన ఘనుడు జగన్: పట్టాభిరామ్
- నిరుద్యోగ రేటులో బీహార్ ను ఏపీ మించిపోయిందన్న పట్టాభి
- నిరుద్యోగం పెరగడానికి జగన్ అసమర్థతే కారణమని విమర్శ
- నిరుద్యోగ భృతికి కూడా మంగళం పాడారని మండిపాటు
ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన ఘనత జగన్ దేనని అన్నారు. మన దేశంలోని పట్టభద్రుల్లో ఎక్కువగా నిరుద్యోగులు ఏపీలోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో వెల్లడయిందని చెప్పారు. 24 శాతం నిరుద్యోగ రేటుతో బీహార్ ను ఏపీ మించిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ రేటు తెలంగాణలో 16.6 శాతంగా, తమిళనాడులో 16.3 శాతంగా, బీహార్ లో 16.6 శాతంగా, కేరళలో 19.8 శాతంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగడానికి జగన్ అసమర్థతే కారణమని పట్టాభిరామ్ దుయ్యబట్టారు. గత నాలుగేళ్లలో ఉద్యోగాలు రాక 1,745 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఏపీకి రూ. 1,26,615 కోట్ల పెట్టుబడులు వచ్చాయని... జగన్ సీఎం అయిన తర్వాత ఏడాదికి రూ. 13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు అందించిన నిరుద్యోగ భృతికి కూడా జగన్ మంగళం పాడారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, వైసీపీ నేతల వేధింపులను భరించలేకే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని చెప్పారు.