ఆయన అజ్ఞాతవాసి, ఈయన అజ్ఞానవాసి: గుడివాడ అమర్ నాథ్
- రాష్ట్రాన్ని వైసీపీ హోల్ సేల్ గా అమ్మేస్తోందన్న మనోహర్
- మనోహర్ పొలిటికల్ బ్రోకర్ అన్న అమర్ నాథ్
- ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ లపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని హోల్ సేల్ గా వైసీపీ అమ్మేయడాన్ని ప్రారంభించిందన్న మనోహర్ వ్యాఖ్యలపై అమర్ నాథ్ స్పందిస్తూ... మనోహర్ ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి అయితే... ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు.
నెల్లూరులో పవర్ ప్రాజెక్టు భూముల వివాదం, హిందూపురంలో అపెరల్ పార్క్ వివాదాలని తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. ఏపీఐఐసీకి చెందిన 12 వేల ఎకరాల భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంపై మనోహర్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రేపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారని... రూ. 750 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు.
జగన్ తీసుకునే నిర్ణయాలకు ఎవరూ అతీతులుకారని అమర్ నాథ్ అన్నారు. అమర్ నాథ్ అవసరం లేదు అనుకుంటే తనను కూడా తీసేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జీల కంటే లక్షలాది మంది కార్యకర్తలే ముఖ్యమని అన్నారు. భవిష్యత్తులో చాలా మార్పులు ఉంటాయని చెప్పారు. జగన్ తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ జెండా పట్టుకుని తిరుగుతామే తప్ప... తమకు మరో ఆలోచన ఉండదని అన్నారు.