రూ.500కే గ్యాస్ సిలిండర్ కోసం... గ్యాస్ ఏజెన్సీల వద్దకు పోటెత్తిన వినియోగదారులు
- రూ.500 పథకం కోసం కేవైసీ తప్పనిసరి అని ప్రచారం
- తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న గ్యాస్ ఏజెన్సీలు
- వినియోగదారులు మాత్రం పనులు ఆపుకొని ఏజెన్సీల వద్ద క్యూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటొక్కటీ అమలు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. మిగిలిన గ్యారంటీలను 100 రోజుల్లో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. అలాగే, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం అమలు కావడానికి కేవైసీ తప్పనిసరి అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సూర్యాపేట జిల్లాలోని వినియోగదారులు పలు ఏజెన్సీల వద్దకు కేవైసీ కోసం వరుస కట్టారు. అయితే ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం తమకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అలాగే కేవైసీ కోసం చివరి తేదీ అంటూ ఏమీ లేదని తెలిపారు. అయితే వినియోగదారులు మాత్రం తమ పనులు ఆపుకొని ఏజెన్సీల వద్ద వరుస కట్టారు.