హమాస్ సొరంగాల్లోకి నీళ్లు పంపి ఉగ్రవాదులను జలసమాధి చేస్తున్న ఇజ్రాయెల్

  • హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు
  • సొరంగాల్లోకి నీటిని విడుదల చేస్తున్న ఇజ్రయెల్ డిఫెన్స్ ఫోర్స్
  • పూర్తిగా నీటిని నింపేందుకు కొన్ని వారాల సమయం పడుతుందన్న అధికారులు
  • గతంలో ఈజిప్ట్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసిన వైనం
ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యమన్న ఇజ్రాయెల్.. గాజాలోని సొరంగాల్లో నక్కిన హమాస్ ఫైటర్లను జల సమాధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గుర్తించిన సొరంగాల్లోకి సముద్రపు నీటిని విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఇది తొలి దశలో ఉందని, సొరంగాల్లోకి పూర్తిగా నీటిని నింపేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అమెరికా వర్గాలు తెలిపారు. 

సొరంగాల్లోకి నీటిని నింపడం పూర్తయితే ఉగ్రవాదులు దాక్కున్న చాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు, ఆయుధగారాలు పూర్తిగా ధ్వంసమైపోతాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులు భావిస్తున్నారు. అయితే, సముద్రపు నీటిని సొరంగాల్లోకి విడిచిపెట్టడం వల్ల మంచి నీటి వనరులు దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నిజానికి సొరంగాలను ఎలా ధ్వంసం చేయవచ్చన్నదానిపై ఇజ్రాయెల్ దళాలు పలు అవకాశాలను పరిశీలించాయి. చివరికి వాటిని నీటితో నింపడమే సరైనదన్న నిర్ణయానికి వచ్చాయి. కాగా 2015లో ఈజిప్ట్ కూడా ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసి విజయం సాధించాయి. గాజాపట్టీ-సినాయ్ ద్వీపకల్పం మధ్య సొరంగాలను సముద్రపు నీటితో నింపి ధ్వంసం చేసింది. గాజా సరిహద్దులోని దాదాపు 14 కిలోమీటర్ల పొడవున భారీ పైపులతో నీటిని వదిలారు. ఆ తర్వాత ఆ నీటిని చేపల పెంపకానికి ఉపయోగించారు.


More Telugu News