రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • ప్రజల సొమ్మును అప్పనంగా పంచిపెట్టబోమని వెల్లడి
  • ట్యాక్స్ కట్టేవారికి రైతుబంధు ఇవ్వడం సమంజసం కాదన్న కాంగ్రెస్ నేత
  • వందలు, వేల ఎకరాలు ఉన్న వారికి ఇవ్వబోమని వ్యాఖ్య
ఆదాయపు పన్ను కట్టే వారికి, వందలు వేల ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు ఇవ్వడం సమంజసం కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుబంధు కింద ఇచ్చే సొమ్ము ప్రజల కష్టార్జితమని చెప్పారు. అలాంటి సొమ్మును అనర్హులకు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. సాగు భూమికి, సేద్యం చేసే వారికే రైతుబంధు ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో అవసరమైన మార్పులు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే సాగు పనులు ఊపందుకోవడంతో ఈసారి కూడా పాత పద్ధతిలోనే రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవన్ రెడ్డి వివరించారు.

5 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రతిపాదనకు రైతాంగంతో పాటు సామాన్యుల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. రైతు భరోసా పథకంతో పాటు రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలపై ప్రభుత్వం చర్చిస్తోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా విధివిధానాలను రూపొందించి త్వరలోనే రైతు కూలీలను ఆదుకుంటామని చెప్పారు. రైతు రుణమాఫీ నిరంతర ప్రక్రియ అని ఎమ్మెల్సీ చెప్పారు. యాసంగి పంటకు సంబంధించి ఎలాంటి కోతల్లేకుండా కొనుగోలు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని వివరించారు.




More Telugu News