లండన్‌లో రూ.1,444 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేయనున్న అదార్ పూనావాలా

  • లండన్‌లోని మేఫెయిర్ ప్రాంతంలోని ‘అబెర్‌కాన్‌వే హౌస్’ కొనుగోలు
  • 1920ల నాటి విలాసవంతమైన భవనాన్ని దక్కించుకున్న సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో
  • కుటుంబ సభ్యులు యూకేకి వెళ్లినప్పుడు నివాసం కోసం కొనుగోలు
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా లండన్‌లోని మేఫెయిర్‌ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయనున్నారు. హైడ్ పార్క్‌కు సమీపంలో ఉన్న 1920ల నాటి ‘అబెర్‌కాన్‌వే హౌస్’ అనే భవనాన్ని సుమారు 138 మిలియన్ పౌండ్‌లు వెచ్చింది సొంతం చేసుకోనున్నారు. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 1,444.4 కోట్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్రిటిష్ అనుబంధ సంస్థ ‘సీరం లైఫ్ సైన్సెస్’ దీనిని కొనుగోలు చేయనుందని ‘ఫైనాన్సియల్ టైమ్స్’ రిపోర్ట్ తెలిపింది. లండన్‌లో ఇప్పటివరకు అమ్ముడు పోయిన భవనాల్లో ఇది రెండవ అత్యంత ఖరీదైనదిగా నిలవనుందని పేర్కొంది. 

పూనావాలా కుటుంబానికి శాశ్వతంగా యూకేకి నివాసం మార్చుకునే ఉద్దేశంలేదని, అయితే యూకే సందర్శనల సమయాల్లో నివాసం కోసం మాత్రమే ఈ భవనాన్ని కొనుగోలు చేసినట్టు సీరమ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన వర్గాలు పేర్కొన్నాయి. కుటుంబ సభ్యులతోపాటు కంపెనీకి కూడా స్థావరంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.


More Telugu News