మంచం కింద పడుకుని తుపాకి పేల్చిన నాలుగేళ్ల బాలుడు.. తల్లిదండ్రులపై కేసు

  • అమెరికాలోని వెస్ట్‌మోర్‌ల్యాండ్‌లో ఈ ఏడాది జులైలో ఘటన
  • విచారణ అనంతరం తల్లిదండ్రులపై అభియోగాల నమోదు
  • తుపాకులను సురక్షిత ప్రదేశంలో దాయడం ద్వారా ఇలాంటి ఘటనలను నిరోధించవచ్చన్న అటార్నీ
అమెరికాలోని వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీలో నాలుగేళ్ల బాలుడు మంచం కింద పడుకుని తుపాకితో తనను తాను కాల్చుకుని గాయపరుచుకున్న ఘటనలో తల్లిదండ్రులు లారా స్టీల్, మైఖేల్ లిన్‌పై జిల్లా న్యాయాధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ అనంతరం పిల్లల సంక్షేమాన్ని ప్రమాదంలో పడేయడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై అభియోగాలు నమోదు చేశారు. ఇదొక విషాద ఘటన అని, ఆమోదయోగ్యం కానిదని జిల్లా అటార్నీ పేర్కొన్నారు. ఇటువంటి వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలను నిరోధించాలంటే అందుకున్న ఏకైక మార్గం తుపాకులను సురక్షిత ప్రదేశంలో ఉంచడమేనని స్పష్టం చేశారు. 

ఈ ఏడాది జులై 6న రోస్ట్రావర్ టౌన్‌షిప్‌లోని గౌడియా డ్రైవ్‌లోని తన ఇంట్లో నాలుగేళ్ల రోనీలిన్ ప్రమాదవశాత్తు తుపాకి పేల్చి గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఇప్పటికీ నిరంతర వైద్య సంరక్షణ పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. తుపాకిని లోడ్‌చేసి బెడ్‌రూంలో నేలపై ఉంచడంతోనే ఈ ఘటన జరిగిందని విచారణలో వెల్లడైంది. ఘటన సమయంలో స్టీల్, లిన్ ఇద్దరూ ఉన్నారు. తుపాకి శబ్దం వినిపించిన తర్వాత వెళ్లి చూస్తే కుమారుడు గాయంతో రక్తమోడుతూ కనిపించాడు. పక్కనే తుపాకి ఉంది. 

ప్రతి నేరాన్ని నిరోధించలేమని, కానీ అత్యంత దుర్బలమైన వాటిని నిరోధించేందుకు ఓ మార్గాన్ని కనుగొనాల్సి ఉందని జిల్లా అటార్నీ పేర్కొన్నారు. తుపాకులను సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా ఇటువంటి ఘటనలను నిరోధించవచ్చని వివరించారు.


More Telugu News