ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్... టెండర్లు పిలిచిన బీసీసీఐ

  • 2024-28 వరకు స్పాన్సర్ షిప్ కు టెండర్ల ఆహ్వానం
  • జనవరి 8 వరకు దరఖాస్తుల కొనుగోలు గడువు
  • దరఖాస్తు కొనుగోలు ఫీజును రూ.5 లక్షలుగా నిర్ణయించిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వచ్చే సీజన్ నుంచి కొత్త స్పాన్సర్ రానుంది. 2024 సీజన్ నుంచి 2028 వరకు ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బీసీసీఐ తాజాగా బిడ్డింగ్ లకు ఆహ్వానం పలికింది. 

టెండర్ వేయదలచిన సంస్థలు రూ.5 లక్షల దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు తిరిగి చెల్లించరు. నిర్ణీత రుసుం రూ.5 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించి బీసీసీఐ నుంచి దరఖాస్తులు పొందేందుకు జనవరి 8 వరకు గడువు ఇచ్చారు. 

ఈ దరఖాస్తును ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) డాక్యుమెంట్ గా బీసీసీఐ పేర్కొంది. ఈ ఐటీటీ డాక్యుమెంట్ లో నియమ నిబంధనలు, టెండరు ప్రక్రియ వివరాలు, అర్హత నియమావళి, బిడ్డింగ్ దాఖలు, హక్కులు, ఇతర వివరాలు ఉంటాయి. 

కాగా, బిడ్డింగ్ ప్రక్రియను ఏ దశలోనైనా నిలుపుదల చేసేందుకు, సవరణలు చేసేందుకు తమకు పూర్తి హక్కులు ఉంటాయని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.


More Telugu News