ప్రజావాణికి భారీ స్పందన.... జ్యోతిరావ్ ఫూలే భవన్ వద్ద బారులు తీరిన ప్రజలు

  • జ్యోతిరావ్ ఫూలే భవన్ వద్ద ప్రజావాణి కార్యక్రమం
  • ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ
  • కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తుందని భరోసా
తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి వచ్చీ రావడంతోనే ప్రజల కోసం ప్రగతి భవన్ (ఇప్పుడు జ్యోతిరావ్ ఫూలే భవన్) బారికేడ్లు తొలగించడం తెలిసిందే. అంతేకాదు, ప్రజావాణి పేరిట విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. హైదరాబాదులోని జ్యోతిరావ్ ఫూలే భవన్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 

ఇవాళ రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావ్ ఫూలే భవన్ వద్ద ప్రజలు బారులు తీరి ఉండడం కనిపించింది. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. 

ప్రతి దరఖాస్తుకు ఒక నెంబరు కేటాయిస్తామని, దరఖాస్తుదారుల ఫోన్ నెంబరుకు సందేశం కూడా పంపిస్తామని వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు దాన కిశోర్, రొనాల్డ్ రాస్ లు ఈ ప్రజావాణి కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్ అధికారులు ముషారఫ్ అలీ, హరిచందన (ఆయుష్ డైరెక్టర్) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


More Telugu News