తుపాన్ లేవీ రావట్లేదు.. వాతావరణ శాఖ క్లారిటీ

  • సోషల్ మీడియా ప్రచారంలో నిజంలేదు
  • ఆందోళన చెందాల్సిన పనిలేదన్న అధికారులు
  • కోస్తాకు ప్రస్తుతం వర్ష సూచన లేదని వివరణ
బంగాళాఖాతంలో తుపాన్ రానుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని, ఆ వార్తల్లో నిజంలేదని చెప్పారు. ఈమేరకు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ మీడియాకు వివరణ ఇచ్చారు. రైతులు, కోస్తా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఈ నెల 21న బంగాళాఖాతంలో తుపాన్ రాబోతోందని, దాని ప్రభావంతో కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తుపాన్ ప్రభావంతో ఈ నెల 21 నుంచి 23 వరకు వర్షాలు కురుస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక సందేశాలు వస్తున్నాయి. ఈ ప్రచారం నేపథ్యంలో కోస్తాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు వాతావరణ శాఖ కేంద్రానికి ఫోన్ చేశారు.

తుపాన్ కు సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. అయితే, ఇప్పట్లో తుపాన్ లేవీ రావడంలేదని, తాము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు చెప్పారు. రైతుల్లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తాజాగా ఈ వివరణ ఇచ్చారు.


More Telugu News