రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూల్
- గత పరీక్షల్లో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలతో విద్యార్థుల్లో గందరగోళం
- ఈ నేపథ్యంలో నేడు సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ ఉండే అవకాశం
టీఎస్‌పీఎస్సీ పరీక్షలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో పేపర్ లీక్, పరీక్షల వాయిదాలు విద్యార్థులను గందరగోళానికి గురి చేశాయి. ఈ అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పరీక్షల తేదీని మార్చి కొత్త పరీక్షల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.