లోక్ సభ సభ్యత్వానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా

  • 2019లో ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి
  • కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి సమావేశం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన గత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్గొండ నుంచి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు. ఈ క్రమంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. ఈ రోజు కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్నాక లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లాని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

సాయంత్రం 5.30గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర అధికారులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సాయం అందించాలని చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ రహదారిని ఆరు లైన్లకు విస్తరించే చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీని కోరారు.  

అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారులపై పలు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినట్లు తెలిపారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి వీలైనంత ఎక్కువగా నిధులు సాధిస్తానని తెలిపారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో చాలా రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించానని వెల్లడించారు.


More Telugu News