జానారెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. గంటసేపు చర్చించుకున్న నేతలు

  • సీఎంను శాలువాతో సత్కరించిన జానారెడ్డి  
  • తన కొడుకు జైవీర్ ఇంకా జూనియర్ అని వ్యాఖ్య  
  • ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవాలని రేవంత్ కు చెప్పానన్న జానారెడ్డి
  • కేసీఆర్ గాయపడటం బాధాకరమని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఇంటికి వచ్చిన రేవంత్ ను జానారెడ్డి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ దాదాపు గంటసేపు చర్చించుకున్నారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని రేవంత్ కు సూచించానని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఐకమత్యంతో కలిసి పని చేయాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని చెప్పారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నానని... ఇప్పుడు తన కొడుకు జైవీర్ ఎమ్మెల్యే అయ్యాడని తెలిపారు. తన కొడుకు ఇంకా జూనియర్ అని... ఆయనకు ఇప్పుడే పదవులు అడగడం సమంజసం కాదని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ గాయపడటం బాధాకరమని, ఆయనను తాను పరామర్శించానని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని... ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి తగిన సూచనలను ఇవ్వాలని కోరారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.


More Telugu News