హమాస్ అంతానికి ఇది ఆరంభమే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

  • గాజాపై హమాస్ పట్టుకోల్పోయిందని వెల్లడి
  • మిలిటెంట్లు లొంగిపోతున్నారంటూ వివరణ
  • హమాస్ పై యుద్ధం చివరికి వచ్చిందన్న నెతన్యాహు
హమాస్ మిలిటెంట్ గ్రూప్ ను తుడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం చివరి దశకు చేరుకుందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ప్రస్తుతం దాడులు కొనసాగిస్తున్నామని, అయితే ఇది అంతానికి ఆరంభమని పేర్కొన్నారు. గాజాపై హమాస్ పట్టుకోల్పోయిందని, మిలిటెంట్లు లొంగిపోతున్నారని తెలిపారు. మిగతా మిలిటెంట్లు కూడా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని హితవు పలికారు. హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ కోసం మీ ప్రాణాలు బలివ్వవద్దని మిలిటెంట్లకు సూచించారు. గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) చేస్తున్న దాడులను నెతన్యాహు సమర్థించారు.

హమాస్ సంస్థను సమూలంగా తుడిచిపెడతామని, అప్పటి వరకు యుద్ధం ఆపేది లేదన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు దశకు వచ్చేసిందని, త్వరలోనే పూర్తవుతుందని వివరించారు. మిలిటెంట్లు లొంగిపోతున్నారంటూ చేసిన ప్రకటనకు నెతన్యాహు ఎలాంటి ఆధారాలు చూపలేదు. మరోవైపు, నెతన్యాహు ప్రకటనను హమాస్ కొట్టిపారేసింది. తమ మిలిటెంట్లు ఎవరూ ఇజ్రాయెల్ బలగాలకు లొంగిపోలేదని ప్రకటించింది. 

గత అక్టోబర్ 7 న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 12 వందల మంది ఇజ్రాయెల్, ఇతర దేశాలకు చెందిన పౌరులను మిలిటెంట్లు కాల్చి చంపారు. వందలాది పౌరులను బందీలుగా గాజాకు తరలించారు. దీంతో ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. హమాస్ మిలిటెంట్ల ఏరివేతకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, గాజాపై క్షిపణుల వర్షం కురిపించింది. ఉత్తర గాజాను దాదాపుగా తుడిచిపెట్టింది. ప్రస్తుతం దక్షిణ గాజాలోని మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేస్తోంది.


More Telugu News