లోపాలు సవరించకుండానే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు: నిమ్మగడ్డ రమేశ్

  • మాజీ ఐఏఎస్ అధికారులతో ఏర్పడిన సిటిజన్ ఫర్ డెమొక్రసీ
  • నేడు తిరుపతిలో సమావేశం
  • ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయన్న నిమ్మగడ్డ
  • లొసుగులు సరిచేయాల్సిన బాధ్యత సీఈవోపైనే ఉందని స్పష్టీకరణ
ఏపీలో మాజీ ఐఏఎస్ అధికారులతో ఏర్పడిన సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఫోరం ఓటర్ల జాబితా లొసుగులపై పోరాటం కొనసాగిస్తోంది. నేడు తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిటిజన్ ఫర్ డెమొక్రసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఏపీలో ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా అంశంలో ఆరోపణలు వినిపిస్తున్నాయని, సిబ్బంది వ్యవహారం విమర్శల పాలవుతోందని అన్నారు. 

లోపాలు సవరించకుండానే ఏపీలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో లొసుగులను చక్కదిద్దాల్సిన బాధ్యత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై ఉంటుందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. 

ప్రస్తుతం బీఎల్వోల (బూత్ లెవల్ ఆఫీసర్లు) తీరు కూడా సరిగా లేదని, గతంలో బీఎల్వోలు నిష్పాక్షికంగా వ్యవహరించారని, కానీ ఇప్పటి బీఎల్వోలు రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఓట్లను ఒకేసారి పెద్ద మొత్తంలో తొలగించకూడదన్న సీఈసీ నిబంధనలు అమలు కావడంలేదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. 

అటు, రాష్ట్రంలో వార్డు/గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఫోరం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిందని వెల్లడించారు. రాజ్యాంగ విరుద్ధంగా సలహాదారులను నియమించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ తీవ్రంగా విమర్శించారు.


More Telugu News