అండర్-19 ఆసియా కప్: పాక్ చేతిలో ఓడిపోయిన భారత కుర్రాళ్లు

  • దుబాయ్ లో అండర్-19 ఆసియా కప్
  • పాక్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్
  • 260 పరుగుల లక్ష్యాన్ని 47 ఓవర్లలో కొట్టేసిన పాక్
  • అజాన్ అవాయిస్ అజేయ సెంచరీ
  • రెండు వికెట్లు తీసిన హైదరాబాదీ బౌలర్ మురుగన్ అభిషేక్
దుబాయ్ లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ లో ఫేవరెట్ గా బరిలో దిగిన టీమిండియా యువ జట్టు నేడు పాకిస్థాన్ లో చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన పాక్ కుర్రాళ్ల జట్టు 8 వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. అనంతరం, 260 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

వన్ డౌన్ బ్యాటర్ అజాన్ అవాయిస్ అజేయ సెంచరీతో పాక్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. అజాన్ 130 బంతుల్లో 10 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. అతడికి కెప్టెన్ సాద్ బేగ్ నుంచి విశేష సహకారం లభించింది. ధాటిగా ఆడిన సాద్ బేగ్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 68 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్ షహజైబ్ ఖాన్ 88 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు సాధించాడు. 

భారత బౌలర్లలో హైదరాబాద్ కు చెందిన మురుగన్ అభిషేక్ 2 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ వికెట్ తీయలేకపోయారు.


More Telugu News