కెప్టెన్ రోహిత్ శర్మపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడంటూ రోహిత్‌పై ప్రశంసల జల్లు
  • ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన కెప్టెన్ లేదా జట్టుని నిందించలేమని వ్యాఖ్య
  • రోహిత్ ఫామ్‌లో ఉంటే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా నాయకత్వం అప్పగించాలని మాజీ ఆటగాడి సలహా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణించాడని పొగిడాడు. ప్రపంచ కప్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించిందని, దురదృష్టవశాత్తూ ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిందని ప్రస్తావించాడు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ  చాలా బాగా రాణించాడని, 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలవడం అంత సులువైన పనికాదని ప్రశంసించాడు. నవంబర్‌లో ముగిసిన 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించిన తీరు అద్భుతమన్నాడు. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు కూడా తాను ఇదే చెప్పానని, ఫలితంతో సంబంధం లేకుండా భారత్ ఛాంపియన్ జట్టులా ఆడిందని చెప్పానని గంభీర్ ప్రస్తావించాడు. ఓడి పోయిన ఒక్క మ్యాచ్ కారణంగా  రోహిత్ శర్మను లేదా టీమ్‌ను బ్యాడ్ అనలేమని సమర్ధించాడు. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టోర్నమెంట్ మొత్తం టీమిండియా ఆధిపత్యం చెలాయించిందని, ఒక్క ఓటమి కారణంగా రోహిత్ శర్మను చెడ్డ కెప్టెన్ అని పిలివడం సరైనది కాదని గంభీర్ అన్నాడు. కాగా వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురయ్యిన విషయం తెలిసిందే. 


రోహిత్ మంచి ఫామ్‌లో ఉంటే 2024 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు నాయకత్వం వహించాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఫామ్‌లో టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయాలని, ఫామ్‌లో లేకుంటే రోహిత్‌తోపాటు ఏ ఆటగాడినీ ఎంపిక చేయకూడదని సూచించాడు. ‘‘ కెప్టెన్సీ ఒక బాధ్యత. కెప్టెన్‌ను కూడా తొలుత ఒక ఆటగాడిగానే ఎంపిక చేస్తారు. ఆపై అతడికి పగ్గాలు అప్పగిస్తారు. కెప్టెన్‌కి తుది జట్టులో శాశ్వత స్థానం ఉంటుంది. అయితే ఆ శాశ్వత స్థానం అతడి ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది’’ అని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి లేదా ఎందుకు పక్కనపెట్టాలనేందుకు వయసు ప్రమాణం కాకూడదని, ఫామ్‌ను మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలని సలహా ఇచ్చాడు. రిటైర్మెంట్ కూడా ఆటగాడి వ్యక్తిగత నిర్ణయమని, రిటైర్మెంట్ కావాలంటూ ఎవరూ ఒత్తిడి చేయరని, అయితే ఎంపిక చేయకూడదనే హక్కు సెలెక్టర్లకు ఉంటుందని గంభీర్ అన్నాడు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News