పెన్షన్ కోసం భర్తపై భార్య హత్యాయత్నం.. ఇద్దరితో కలిసి ఏం చేసిందంటే..

  • మండే ఇంధనాన్ని పోసి నిప్పు అంటించిన భార్య
  • నిందితురాలికి సహాయపడ్డ ఇద్దరు యువకులు
  • ఇరుగుపొరుగువారు చూసి రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డ వృద్ధుడు
  • కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించిన పోలీసులు
పెన్షన్ కోసం ఓ భార్య కిరాతకంగా వ్యవహరించింది. కట్టుకున్న భర్తనే కడతేర్చాలని చూసింది. ఇద్దరు యువకుల సహాయంతో నిప్పంటించింది. కానీ అదృష్టం కొద్దీ బాధితుడు కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

థానే జిల్లాలోని కళ్యాణ్‌ నగరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడిపై అతడి భార్య, నిందిత యువకులు ఇద్దరు దాడి చేశారు. అనంతరం మండే ద్రవాన్ని అతడిపై పోయగా భార్య నిప్పంటించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి బాధితుడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదవ్వగా దర్యాప్తు మొదలైంది.

నెలవారీ పెన్షన్ విషయంలో భార్య తనతో గొడవ పడుతుండేదని, ఇద్దరు యువకులు తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండడంపై తాను అభ్యంతరం తెలిపేవాడినని బాధితుడు చెప్పాడు. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంలో వాగ్వాదం జరిగిందని, ఇద్దరు యువకులు వచ్చి తనపై దాడి చేశారని చెప్పారు. ఇంధనాన్ని పోసి నిప్పు అంటించారని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. హత్యాయత్నంలో పాల్గొన్న నిందిత యువకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు గతంలో ఒకసారి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో నిందిత యువకులు బాధితుడి కూతుళ్లలో ఒకరికి స్నేహితులని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.


More Telugu News