ఇలాంటి సమయాల్లో కేంద్రం సాయం కోరాలని కూడా ఈ సీఎంకు తెలియదేమో: చంద్రబాబు

  • బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
  • పర్చూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పరిశీలన
  • తుపానుపై రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు
  • రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించుకోని ఈ ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. ఒక వ్యక్తి అహంకారానికి రాష్ట్ర రైతులు బలైపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు అసమర్థ ముఖ్యమంత్రే కారణమని విమర్శించారు. రోడ్లు, సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సీఎంకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై, సాగునీటిపై లేదని విమర్శలు చేశారు. 

మిగ్జామ్ తుపాను గురించి రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులకు సకాలంలో గోనె సంచులు ఇచ్చినా ధాన్యం తడవకుండా ఇంటికి తెచ్చుకునేవారని తెలిపారు. పట్టిసీమ నీరు ముందే వదిలినా అక్టోబరు నాటికి పంట చేతికొచ్చి ఉండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తుపాన్లను ఆపలేం... కానీ ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించే వీలుంటుంది కదా అని వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. విపత్తు నష్టం నుంచి ఆదుకోవాలని కేంద్రాన్ని కూడా కోరలేదని మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కేంద్రం సాయం అడగాలని కూడా ఈ సీఎంకు తెలియదేమో అంటూ చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

రైతుల తరఫున తాను పోరాటం చేస్తానని, వారికి అండగా నిలుస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు. రైతులు ధైర్యం కోల్పోయి అఘాయిత్యాలు చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు.


More Telugu News