వ్యవసాయ పెట్టుబడి సాయం 'రైతు బంధు' ఎప్పుడు ఇస్తారు?: హరీశ్ రావు

  • వ్యవసాయ పెట్టుబడి సాయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదని వ్యాఖ్య
  • అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ప్రజల పక్షానే ఉంటామన్న హరీశ్ రావు
  • డిసెంబర్ 9న రైతులకు రూ.15వేలు ఇస్తామని చెప్పి... ఇవ్వడం లేదని విమర్శ
వ్యవసాయ పెట్టుబడి సాయం రైతుబంధుపై ఇప్పటి వరకు స్పష్టతలేదని, ఈ అంశంపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... అధికారం ప‌క్షమైనా.. ప్ర‌తిప‌క్ష‌మైనా ఎప్ప‌టికీ తాము ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డుతామన్నారు. అధికారంలోకి వ‌చ్చాక‌ డిసెంబర్ 9వ తేదీన రైతులకు సాయం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, ఎప్పుడు ఇస్తారో చెప్పాల‌న్నారు. రైతాంగం అంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంద‌న్నారు. వడ్లు అమ్ముకోవద్దని, తాము బోన‌స్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 బోనస్‌తో వడ్లను ఎప్పుడు కొంటారో చెప్పాలని నిలదీశారు.

మిగ్‌జాం తుపాను కార‌ణంగా కొన్నిచోట్ల వ‌డ్లు త‌డిశాయ‌ని, అలాంటి రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. యాసంగి పంట వేసే సమయం వచ్చిందని, దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ కావాలన్నారు. డిసెంబర్ 9 వచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News