దళంలో ఉన్నప్పుడు మంత్రి ధనసరి సీతక్క ఇలా ఉండేవారు!

  • ఇటీవలి ఎన్నికల్లో ములుగు నుంచి గెలిచిన సీతక్క
  • సీతక్కకు రేవంత్ మంత్రివర్గంలో చోటు
  • పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయింపు
  • 14 ఏళ్ల వయసులోనే అడవి బాట పట్టిన సీతక్క
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి జయభేరి మోగించిన ధనసరి సీతక్కను మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవుల కేటాయింపులో ఆమెను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. 

సీతక్క సామాజిక ప్రస్థానం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ. పరిస్థితుల నేపథ్యంలో 14 ఏళ్ల వయసులోనే నక్సల్ ఉద్యమం పట్ల ఆకర్షితులై దళంలో చేరారు. అప్పటికి ఆమె 10వ తరగతి విద్యార్థిని. 

దాదాపు దశాబ్దకాలం పాటు నక్సలైట్ గా కొనసాగిన ఆమె, 1997లో హింసకు స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రంపై మక్కువతో ఎల్ఎల్ బీ చదివారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో 2004లో టీడీపీలో చేరి తొలి ప్రయత్నంలో ములుగు నుంచి ఓటమి పాలయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 2009లో నెగ్గి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

వివిధ పరిణామాల నేపథ్యంలో సీతక్క 2017లో రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లోనూ, ఇప్పుడు 2023 ఎన్నికల్లోనూ ములుగులో సీతక్క విజయం సాధించారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. 2022లో  పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. 

మంత్రిగా పదవీప్రమాణస్వీకారం చేసేటప్పుడు మిగతా మంత్రుల కంటే ప్రజలు ఆమెకే ఎక్కువ జేజేలు పలికారు. ఎల్బీ స్టేడియం హోరెత్తిపోయింది. కాగా, సీతక్క దళంలో ఉన్నప్పటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రస్థానం గురించి తెలుసుకునేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు.


More Telugu News