ఎస్సై నిర్లక్ష్యం.. తుపాకీ పొరపాటున పేలడంతో మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా.. వీడియో ఇదిగో!

  • ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఘటన
  • బుల్లెట్ తలలో దూసుకుపోవడంతో కుప్పకూలిన బాధితురాలు
  • మహిళకు ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
  • పరారీలో ఉన్న ఎస్సై కోసం పోలీసుల గాలింపు
పోలీసు అధికారి నిర్లక్ష్యం ఓ మహిళను ప్రాణాపాయంలోకి నెట్టింది. ఓ ఎస్సై తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో అది పొరపాటున పేలడంతో మహిళ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌లో అలీగఢ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. అలీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం, ఇష్రత్ అనే మహిళ పాస్‌పోర్టు వెరిఫికేషన్ వ్యవహారానికి సంబంధించి తన కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో స్టేషన్‌లోనే ఉన్న ఎస్సై మనోజ్ కుమార్‌కు మరో పోలీసు ఓ తుపాకీ ఇచ్చి వెళ్లాడు. దీంతో, ఆయన తుపాకీని శుభ్రం చేస్తుండగా పొరపాటున పేలడంతో బుల్లెట్ ఆ మహిళ తలలోకి దూసుకువెళ్లి ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. 

మహిళను వెంటనే స్థానికంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బుల్లెట్ బాధితురాలి తలలోనే ఉందని, ఆపరేషన్‌పై ఇంకా చర్చిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, బుల్లెట్ మహిళ తల వెనకభాగంలో తగిలిందని ఎస్ఎస్పీ చెప్పారు. ఇందుకు కారణమైన ఎస్సైని తక్షణమే సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


More Telugu News