ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • ఇంద్రకీలాద్రి పనులపై పలు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం
  • గతంలో కేటాయించిన నిధులతో పలు ఆలయాల పూర్తి
  • ఆలయాలకు ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేశారు. అన్న ప్రసాద భవనం, ప్రసాదం తయారీ పోటు, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, రాజగోపురం ముందు భాగంలో మెట్ల నిర్మాణం, ఆలయానికి దక్షిణం వైపు అదనపు క్యూ కాంప్లెక్స్, కనకదుర్గ నగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం తదితర పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ పనుల విలువ రూ.216 కోట్లు. 

అంతేకాదు, గతంలో కేటాయించిన రూ.70 కోట్ల నిధులతో పూర్తి చేసిన మరికొన్ని అభివృద్ధి పనులను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. రూ.3.87 కోట్ల నిధులతో పునఃనిర్మాణం జరుపుకున్న ఎనిమిది ఆలయాలను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న బొడ్డు అమ్మ, అమ్మవారి పాత మెట్ల మార్గంలో ఉన్న గణపతి, హనుమంతుడి ఆలయాలను కూడా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం జగన్ దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఆలయ వర్గాలు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశాయి. అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితర వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు.


More Telugu News