మ్యాచ్ మధ్యలో గంభీర్-శ్రీశాంత్ మధ్య గొడవ.. మ్యాచ్ ముగిశాక గంభీర్‌పై శ్రీశాంత్ నిప్పులు

  • సూరత్‌లో లెజండ్స్ లీగ్ క్రికెట్ 2023
  • ఇండియా కేపిటల్స్-గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో గొడవ
  • అంపైర్ల జోక్యంతో సద్దుమణిగిన వైనం
  • మ్యాచ్‌ ముగిశాక గంభీర్‌పై నిప్పులు చెరుగుతూ వీడియో విడుదల చేసిన శ్రీశాంత్
టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్, గౌతం గంభీర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోనే గొడవ పడ్డారు. అంపైర్ల జోక్యంతో అప్పటికి సద్దుమణిగినా, మ్యాచ్ ముగిశాక గంభీర్‌పై శ్రీశాంత్ నిప్పులు చెరిగాడు. అతడి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. లెజండ్స్ లీగ్ క్రికెట్‌ 2023లో భాగంగా నిన్న సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా కేపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ఇండియా కేపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. గంభీర్ క్రీజులో ఉన్నప్పుడు శ్రీశాంత్‌తో వాగ్వివాదం జరిగింది. అంపైర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ మ్యాచ్‌లో కేపిటల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం శ్రీశాంత్ మాట్లాడుతూ.. గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. ఎలాంటి కారణం లేకుండా అతడు తనను రెచ్చగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్‌కు సహచరులను గౌరవించడం రాదని, అతడి తీరు తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నాడు. 

‘‘మిస్టర్ ఫైటర్ (గంభీర్)తో ఏం జరిగిందో నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఎలాంటి కారణం లేకుండానే అతడు తన సహచరులతో చీటికీమాటికి గొడవ పడుతుంటాడు. సీనియర్ ఆటగాళ్లంటే కూడా అతడికి గౌరవం లేదు. వీరూ భాయ్ (వీరేంద్రసింగ్)ను కూడా అతడు గౌరవించిన పాపాన పోలేదు. ఈ రోజు కూడా అదే జరిగింది. నావైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండానే తరచూ పిలుస్తూ ఇబ్బంది పెట్టాడు. సభ్యత లేకుండా ప్రవర్తించాడు. అతడేమన్నాడో నేను చెప్పలేను’’ అని ఓ వీడియోలో శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో గంభీర్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి ఓ వికెట్ పడగొట్టి 35 పరుగులు ఇచ్చుకున్నాడు.


More Telugu News