ప్రమాణస్వీకారం చేయకుండా అధికారిక కాన్వాయ్ వద్దన్న రేవంత్ రెడ్డి

  • బుధవారం రాత్రి బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న కాన్వాయ్‌ని నిరాకరించిన సీఎల్పీ నేత
  • సొంత వాహనంలో మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి ఎల్లా హోటల్‌కు వెళ్లిన రేవంత్
  • భద్రతా కారణాలరీత్యా వాహనాన్ని అనుసరించిన అధికారులు
తాను ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనందున అధికారిక వాహన కాన్వాయ్ ని సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నిరాకరించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన వాహన శ్రేణిని ఆయన వద్దని చెప్పారు. ఆసక్తికరమైన ఈ ఘటన బుధవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఖరారవ్వడంతో అధికారిక కాన్వాయ్‌ని కూడా ఎయిర్‌పోర్ట్ వద్ద అధికారులు సిద్ధంగా ఉంచారు. అయితే తాను ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున కాన్వాయ్ వద్దంటూ రేవంత్ రెడ్డి నిరాకరించారు. సొంత వాహనంలో మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరారు. అయితే భద్రతా కారణాలరీత్యా కాన్వాయ్‌ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమదేనని భావించిన అధికారులు రేవంత్‌ వాహనాన్ని అనుసరించారు. 

కాగా బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి అక్కడి నుంచి నేరుగా గబ్బిబౌలిలోని ఎల్లా హోటల్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు.  ప్రమాణస్వీకారానికి సంబంధించిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.


More Telugu News