మిగ్‌జాం బాధిత రైతుల్ని జగన్ బటన్ నొక్కి ఆదుకోవాలి: నాదెండ్ల మనోహర్
- తెనాలిలో తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్
- బాధిత రైతుల్ని ఆదుకోవాలంటూ డిమాండ్
- ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శ
- ప్రతి గింజను ప్రభుత్వం కొనేవరకూ జనసేన, టీడీపీ పోరాడతాయని స్పష్టీకరణ
మిగ్‌జాం తుపానుతో ఏపీ అతలాకుతలమైతే ప్రభుత్వంలో మాత్రం నిర్లక్ష్యం కనబడుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. తెనాలి నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తుపాను నష్టం అంచనాలు అందటం లేదని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా పంట కాలువల మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం మాయ చేసిందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగింజ కొనే వరకూ జనసేన, టీడీపీ తమ పోరాటం కొనసాగిస్తాయని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.