బాపట్ల వద్ద పూర్తిగా తీరాన్ని దాటిన మిగ్జామ్ తుపాను
- బంగాళాఖాతంలో తీవ్ర తుపాను
- ఈ మధ్యాహ్నం 12.30కి బాపట్ల వద్ద తీరాన్ని తాకిన వైనం
- పూర్తిగా తీరాన్ని దాటేందుకు రెండు గంటల సమయం
- క్రమంగా బలహీనపడి తుపానుగా మారుతుందన్న ఐఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తీవ్ర తుపాను బాపట్ల వద్ద పూర్తిగా తీరాన్ని దాటింది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తీరాన్ని తాకిన మిగ్జామ్ తీవ్ర తుపాను 2.30 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో తీవ్ర తుపాను ప్రభావంతో 100 కిమీ వేగంతో గాలులు వీచినట్టు తెలిపింది. ప్రస్తుతం ఇది బాపట్లకు నైరుతిగా 15 కిమీ దూరంలో, ఒంగోలుకు ఈశాన్యంగా 40 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వివరించింది. ఈ తీవ్ర తుపాను ఉత్తర దిశగా పయనిస్తూ క్రమంగా తుపానుగా బలహీనపడుతుందని తాజా బులెటిన్ లో వెల్లడించింది.