మిగ్జామ్ తుపాను: ఇంటిపైకి ఎక్కి సాయం కోసం అర్థించిన తమిళ హీరో

  • బంగాళాఖాతంలో మిగ్జామ్ తుపాను
  • చెన్నైలో వర్ష బీభత్సం
  • నీట మునిగిన హీరో విష్ణువిశాల్ ఇల్లు
  • చేయగలిగింది ఏమీ లేదంటూ ఫొటోలు పోస్టు చేసిన యువ హీరో
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను చెన్నై నగరంలో బీభత్సం సృష్టించింది. గత మూడ్రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సాధారణ ప్రజలే కాదు సెలెబ్రిటీలు సైతం మిగ్జామ్ తుపాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకు యువ హీరో విష్ణువిశాలే నిదర్శనం. చెన్నై నగరంలో విష్ణు విశాల్ ఇంట్లోకి వరద నీరు రావడంతో సాయం కోసం అర్థించాడు. 

"కరప్పాక్కంలోని మా ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది. సాయం కోసం అర్థించడం మినహా ఇప్పుడు మేం చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు  లేదు, ఇంటర్నెట్ ఆగిపోయింది, ఫోన్ సిగ్నల్ అసలే లేదు. ఏమీ అందుబాటులో లేవు. ఇంటిపైన టెర్రస్ ఎక్కితే కొంచెం ఫోన్ సిగ్నల్ అందుతోంది. నేనే కాదు, ఈ ఏరియాలో చాలామంది వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎవరైనా సాయం చేస్తారని నాతో పాటు వారందరూ ఆశిస్తున్నారు. చెన్నై ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను" అంటూ విష్ణువిశాల్ పేర్కొన్నాడు. 

ఈ మేరకు ట్వీట్ చేశాడు. తన ఇల్లు వరదలో చిక్కుకున్న ఫొటోలను కూడా పంచుకున్నాడు.


More Telugu News