మిగ్జామ్ ఎఫెక్ట్: తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

  • తెలంగాణపైనా మిగ్జామ్ తుపాను ప్రభావం
  • భద్రాద్రి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
  • ఎన్డీఆర్ఎఫ్ బృందాల తరలింపు
  • హైదరాబాదులోనూ ఈ ఉదయం నుంచి వర్షం
మిగ్జామ్ తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి, భూపాలపల్లి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 

ఈ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రెడ్ అలర్ట్ జారీ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలిస్తున్నారు. అటు, హైదరాబాదులోనూ ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది.


More Telugu News