బాపట్ల వద్ద తీరాన్ని తాకిన మిగ్జామ్ తుపాను... మరో గంటలో పూర్తిగా తీరం దాటే అవకాశం
- తమిళనాడు, ఏపీలపై విరుచుకుపడిన తీవ్ర తుపాను మిగ్జామ్
- తుపాను ముందు భాగం భూభాగంపైకి ప్రవేశించిందన్న ఐఎండీ
- బాపట్ల వద్ద ప్రచండగాలులతో భారీ వర్షం
తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై పెను ప్రభావం చూపించిన మిగ్జామ్ తుపాను బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది. మిగ్జామ్ తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల వద్ద కేవలం 4 గంటల వ్యవధిలోనే 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి తుపాను ముందు భాగం పూర్తిగా భూభాగంపైకి ప్రవేశించిందని ఐఎండీ తన తాజా బులెటిన్ లో వెల్లడించింది.