కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని నేను తప్పించలేదు: గంగూలీ వివరణ

  • రోహిత్ ను ప్రోత్సహించిన మాట నిజమేనన్న బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్
  • తన బాధ్యతలలో భాగంగానే చేసినట్లు వెల్లడి
  • మైదానంలో రాణించిన వారికే బాధ్యతలు కట్టబెట్టాలని సూచన
స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. టీ20, టెస్ట్ ఫార్మాట్లలో కెప్టెన్సీకి కోహ్లీ తనకు తానుగా రాజీనామా చేయగా.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ ఆయనను తప్పించింది. ఈ విషయంపై అప్పట్లో బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సౌరవ్ గంగూలీపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంలో గంగూలీదే ప్రధాన పాత్ర అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ ఆరోపణలపై గంగూలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మైదానంలో రాణించిన వారికే బాధ్యతలు కట్టబెట్టాలని చూస్తామని వివరించారు.

కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంలో తన ప్రమేయం ఏమీ లేదని గంగూలీ స్పష్టతనిచ్చారు. కెప్టెన్సీ బాధ్యతలను తీసుకునే విషయంలో రోహిత్ శర్మను ప్రోత్సహించిన విషయం మాత్రం నిజమేనని ఆయన తెలిపారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరించేందుకు రోహిత్ శర్మ విముఖత చూపాడని, దీంతో తాను కాస్త చొరవ చూపించానని చెప్పారు. అయితే, బీసీసీఐ ప్రెసిడెంట్ గా అది తన బాధ్యత అని, టీమిండియా భవిష్యత్తు కోసమే చేశానని వివరించారు. కాగా, 2021 లో టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ తన పదవికి రాజీనామా చేశాడు. ఆపై 2022లో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలకూ రిజైన్ చేశాడు.


More Telugu News