చెన్నై మేయర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన హీరో విశాల్

  • భారీ వర్షాల కారణంగా నీట మునిగిన చెన్నై
  • నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశాల్ ఆవేదన
  • 2015 కంటే ప్రస్తుతం నగర పరిస్థితి మరింత ఘోరంగా ఉందని విమర్శ
మిగ్జామ్ తుపాను కారణంగా చెన్నై స్తంభించిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధిత ప్రజలు ఆహారం, నీటి కోసం అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ పై సినీ నటుడు విశాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2015లో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం ఒక నెలపాటు స్తంభించిపోయిందని... అది జరిగి ఏళ్లు గడిచిపోయినా నగర పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్ విమర్శించారు. వరద నివారణకు చేపట్టిన డ్రెయిన్ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు. తమకు కరెంట్ లేదని విమర్శించారు.

ఎక్స్ వేదికగా విశాల్ స్పందిస్తూ.. 'డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్, ఇతర అధికారులకు.. మీ నివాసాల్లోకి వరద నీరు రావడం లేదని అనుకుంటున్నా. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా. మీ ఇళ్లకు కరెంట్, ఆహారం ఎలాంటి లోటు లేకుండా అందుతోందని భావిస్తున్నా. అయితే, సిటీలో మీతో పాటు నివసిస్తున్న ఇతర ప్రజలు మాత్రం మీ మాదిరి సురక్షితంగా లేరు. మీరు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్ట్ సింగపూర్ కోసమా లేక చెన్నై కోసమా?

2015లో భారీ వర్షాల కారణంగా సంభవించిన విపత్తు సమయంలో అందరం రోడ్ల మీదకు వచ్చి ప్రజలకు సాయం అందించాం. అది జరిగిన 8 ఏళ్ల తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారయింది. ఈ సారి కూడా బాధితులకు మేమంతా ఆహారం, నీటిని పంపిణీ చేసి వారిని ఆదుకుంటాం. అయితే, ఈ సారి ప్రజా ప్రతినిధులంతా వారివారి నియోజకవర్గాల్లో బయటకు వచ్చి బాధితులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా. బాధిత ప్రజల్లో భయం, ఆందోళనను కాకుండా... విశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నా' అని చెప్పారు.


More Telugu News