చెన్నై ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకల పునరుద్ధరణ.. ఇంకా పొంచివున్న ముప్పు

  • మిగ్జామ్ తుపాను ప్రభావంతో చెన్నై అతలాకుతలం
  • ఈ ఉదయం కాస్తంత తెరిపినిచ్చిన వర్షం
  • వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి
  • చెన్నై సహా పలు ప్రాంతాల్లో నేడు కూడా విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు
మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అయిన తమిళనాడు రాజధాని చెన్నై ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. ఈ ఉదయం నుంచి వర్షం ఆగిపోవడంతో ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా నిన్న చెన్నై విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరడంతో ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఇప్పుడు వాన తెరిపినివ్వడంతో రన్‌వేపై నీటిని తొలగించి విమాన రాకపోకలు పునరుద్ధరించారు. భారీ వానల కారణంగా చెన్నైలో వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
ఈ ఉదయం వాన తెరిపినిచ్చినప్పటికీ వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో నేడు కూడా చెన్నై సహా పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.


More Telugu News