మహిళలపై నేరాల్లో భర్తల హింసే ఎక్కువ.. ఎన్‌సీఆర్‌బీ సంచలన రిపోర్ట్

  • 2022లో నేరాలు 4 శాతం మేర పెరిగాయని వెల్లడించిన నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో
  • పిల్లలపై నేరాలు ఆందోళనకరంగా 8.7 శాతం మేర పెరుగుదల
  • రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ
మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది 2022లో మహిళలపై నేరాలు 4 శాతం మేర పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. భర్త లేదా అతడి బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం నివేదికను విడుదల చేసింది. ఇక పిల్లలపైనా నేరాలు అధికమవుతున్నాయని, 2022లో నేరాలు ఏకంగా 8.7 శాతం మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్, అపహరణతోపాటు పోక్సో చట్టం కింద లైంగిక సంబంధ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 2021 సంవత్సరంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించింది.

2022 ఏడాదిలో దేశవ్యాప్తంగా 58,24,946 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 4.5 శాతం ఎక్కువగా ఉంది. ఈ కేసుల్లో ఐపీసీ కింద 35,61,379 నేరాలు నమోదయ్యాయి. ఇక ప్రత్యేక, స్థానిక చట్టాల కింద 22,63,567 నేరాలు నమోదయ్యాయి. ఈ చట్టాల కింద నమోదయిన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా ఇతర చట్టాల కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

ఎన్‌సీఆర్‌బీ డేటాలో ఇతర కీలక అంశాలు..
1. మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాలకు సంబంధించిన కేసులు 2002లో 5.3 శాతం మేర పెరిగాయి.
2. సీనియర్ సిటిజన్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి వ్యక్తులపై నేరాలు గణనీయంగా పెరిగాయి.
3. ఐపీసీ, ప్రత్యేక స్థానిక చట్టాల కింద నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త క్షీణించింది.
4. హత్య కేసులు 2.6 శాతం మేర స్వల్పంగా తగ్గాయి.
5. ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు వరుసగా 11.1 శాతం, 24.4 శాతం మేర పెరిగాయి.
6. మానవ అక్రమ రవాణా కేసులు 2.8 శాతం పెరిగాయి.
కాగా ఎన్‌సీఆర్‌బీ రిపోర్టును పూర్తిగా పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల్లో నేరాలు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయని రిపోర్ట్ పేర్కొంది.


More Telugu News