ఎమ్మెల్యేగా కేసీఆర్ ఓటమిపై విజయశాంతి స్పందన

  • తెలంగాణ కోసం పోరాడిన రోజుల నుంచి కేసీఆర్ అంటే తనకు గౌరవమన్న విజయశాంతి
  • పార్టీతో పాటూ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఓటమి బాధాకరమని వ్యాఖ్య
  • సీఎం పదవికి దూరంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని అభిప్రాయం
తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పాటూ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఓటమి చవిచూడటంపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటినుండి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణ ల బీఆర్ఎస్ పార్టీని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం. 

మొదట కేసీఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండకపోయి ఉండవచ్చు..

ఏదిఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల  గౌరవంతో కూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుండి తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది..’’ అని విజయశాంతి పోస్ట్ పెట్టారు. తాజా ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలోకి దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.


More Telugu News