మూడు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ షాక్?

  • బుధవారం జరగనున్న ఇండియా కూటమి సమన్వయ సమావేశానికి డుమ్మా!
  • సమావేశం గురించి తెలియదంటున్న తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
  • కీలక రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓటమి నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన పరిణామం
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. విపక్ష పార్టీల ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ ప్రాధాన్యతపై ప్రభావం చూపవచ్చునంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ కీలకమైన పరిణామం తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం జరగనున్న తదుపరి ఇండియా కూటమి సమన్వయ సమావేశానికి హాజరు కాకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశానికి సంబంధించిన సమాచారం లేదని కారణంగా చెబుతున్నాయి. కాగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. దాదాపు మూడు నెలల తర్వాత ఈ కూటమి మరోసారి సమావేశమవబోతోంది. చివరిసారిగా ఆగస్టు 31- సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో జరిగింది. 


ఇదిలావుంచితే.. ఇండియా కూటమి పార్టీలతో సీట్ల భాగస్వామ్యం లేకపోవడం కారణంగానే కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లలో ఓడిపోయిందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోరాడాలనే కాంగ్రెస్ నిర్ణయం ఓట్లు చీలడానికి కారణమైందని ఆమె విశ్లేషించారు. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో బీజేపీ భారీ విజయాలు సాధించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట ఇచ్చేదిగా ఉంది.


More Telugu News