తెలంగాణ పరిణామాలతో జగన్‌కు భయం పట్టుకుంది: గోరంట్ల బుచ్చయ్య

  • అసెంబ్లీ ఫలితాలు చూసి జగన్ మైండ్ బ్లాంక్ అయిందన్న గోరంట్ల
  • ముందు ముందు తన పరిస్థితి ఏమిటోనని భయపడుతున్నారని వ్యాఖ్య
  • మిగ్‌జాం తుపాన్ దూసుకొస్తుంటే పట్టించుకోవడం లేదని విమర్శలు
పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్‌కు భయం పట్టుకుందని, అసెంబ్లీ ఫలితాలను చూసి ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముందు ముందు తన పరిస్థితి ఏమిటోనని ఆయన భయపడుతున్నారన్నారు. అందుకే రాష్ట్రాన్ని తుపాను కమ్మేసినా బయటకు రావడం లేదని విమర్శించారు. ప్రచండ వేగంతో మిగ్‌జాం తుపాను రాష్ట్రాన్ని కమ్మేస్తోందని, ఈ సమయంలో రైతులు, మత్స్యకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న అభినవ నీరోచక్రవర్తి జగన్ అని దుయ్యబట్టారు. ఆయన అసమర్థత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదని, విలాసాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.

తుపాను వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రి బాధ్యుడవుతాడని వ్యాఖ్యానించారు. భారీ గాలులతో పంటలు దెబ్బతింటాయని తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీసం ధాన్యం తడవకుండా టార్పాలిన్లను కూడా రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. కేవలం నిధులను విడుదల చేసి చేతులు దులుపుకుంటే బాధ్యత నెరవేర్చినట్లా? అని నిలదీశారు. రైతులు వ్యవసాయం గురించి పట్టించుకోకుండా.. నాగార్జున సాగర్ డ్యామ్‌పైకి పోలీసులను పంపి కావాలనే నాటకాలు ఆడారని ఆరోపించారు.


More Telugu News