తెలంగాణలో 'మిగ్జామ్' తుపాన్ ప్రభావం.. ఎక్కడెక్కడంటే..!

  • నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు
  • భద్రాద్రి సహా 4 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్
  • మరో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ 
తమిళనాడును వణికిస్తున్న 'మిగ్జామ్' తుపాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమ, మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రెండు రోజులకు సంబంధించి పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

'మిగ్జామ్' తుపాన్ నేపథ్యంలో తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డిలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తుపాన్ కారణంగా గాలులు పెరగడంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.


More Telugu News