నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం... కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం

  • నెల్లూరుకు ఆగ్నేయంగా 440 కి.మీ దూరంలో తుపాను
  • తుపానుకు మిచౌంగ్ గా నామకరణం
  • వాయవ్య దిశగా పయనిస్తున్న తుపాను
  • ఈ నెల 5న నెల్లూరు-మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ ఉదయం తుపానుగా బలపడింది. మయన్మార్ దేశం సూచించిన పేరు మేరకు దీన్ని 'మిచౌంగ్' అని పిలవనున్నారు. ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి చేరువలోకి వచ్చింది. నెల్లూరుకు ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఈ తుపాను మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని వాయవ్య దిశగా పయనిస్తూ డిసెంబరు 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. 

దీని ప్రభావంతో డిసెంబరు 3న కోస్తాంధ్రలో చాలా ప్రదేశాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. డిసెంబరు 4, 5 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 

రాయలసీమలో డిసెంబరు 3, 4 తేదీల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరకోస్తా జిల్లాల్లో డిసెంబరు 6న విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఏపీ తీరప్రాంత జిల్లాల్లో డిసెంబరు 3 సాయంత్రం నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో గాలుల వేగం 100 కి.మీకి పైగా ఉంటుందని ఐఎండీ వివరించింది.

ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈ నెల 6వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. మిచౌంగ్ తుపాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో ఒక మీటరు నుంచి ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది. 

తుపాను వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆస్తినష్టం జరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది.


More Telugu News