తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
- గతంలో అంచనాలకు దగ్గరగా ఇండియా టుడే-యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్
- మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్
- తెలంగాణలో కాంగ్రెస్‌కే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగ్గా మిజోరం సహా మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో జోరు చూపించేదెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఓటేశాయి. గత ఎన్నికల్లో అంచనాలకు దగ్గరగా వచ్చిన ‘ఇండియా టుడే-యాక్సెస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో చూద్దాం.
* 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. బీజేపీకి ఇక్కడ 140 నుంచి 162 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 68 నుంచి 90 స్థానాలు వస్తాయి.
* రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కే మొగ్గు ఉంది. హస్తం పార్టీ ఇక్కడ 86 నుంచి 106 స్థానాలను సొంతం చేసుకోనుండగా, బీజేపీ 80 నుంచి 100 స్థానాలతో సరిపెట్టుకుంటుంది.
* చత్తీస్‌గఢ్‌లో అధికారం మరోమారు కాంగ్రెస్‌దేనని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఇక్కడ మొత్తం 90 స్థానాలుండగా కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలు గెలుచుకుని అధికారంలో వస్తుందని అంచనా వేసింది. ప్రతిపక్ష బీజేపీ 36 నుంచి 46 స్థానాలకు పరిమితమవుతుంది.
* ఇక, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొన్నా ఇండియా టుడే పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కే అధకారం కట్టబెట్టాయి. 42శాతం ఓట్ షేర్‌తో హస్తంపార్టీ 68 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. అధికార బీఆర్ఎస్ 36 శాతం ఓట్ షేర్‌తో 39 స్థానాలకు పరిమితం అవుతుంది.