మిచౌంగ్ తుపాను: నెల్లూరు జిల్లాలో మొదలైన వర్షాలు... ప్రకాశం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

  • నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • రేపు ఉదయానికి తుపానుగా మారే అవకాశం
  • ఏపీ కోస్తా జిల్లాలో అలజడి
  • నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో ఎగసిపడుతున్న అలలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఏపీ తీరంపై దీని ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు నగరంలో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రహదారులు జలమయం అయ్యాయి. జిల్లాలోని మైపాడు బీచ్ లో అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను నెల్లూరు జిల్లాకు అత్యంత చేరువగా వస్తుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

అటు, ప్రకాశం జిల్లాకు కూడా తుపాను ముప్పు ఉందని వాతావరణ సంస్థలు పేర్కొనడంతో, అధికారులు స్పందించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా ప్రకాశం జిల్లాలో సోమ, మంగళవారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

అన్ని శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుపాను తీరం దాటే సమయంలో గాలి ఉద్ధృతంగా వీస్తుందని హెచ్చరించారు. గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు.


More Telugu News