కృష్ణా జలాలపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్... హాజరైన ఏపీ సీఎస్

  • నాగార్జునసాగర్ వివాదం పరిష్కారానికి కేంద్రం ప్రయత్నాలు
  • నేడు జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ 
  • తెలంగాణ ప్రభుత్వం నీటిని విచక్షణ రహితంగా వాడుతోందన్న ఏపీ సీఎస్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, కేఆర్ఎంబీ అధికారులు నిర్వహించిన ఈ సమావేశానికి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి హాజరయ్యారు. సీఎస్ జవహర్ రెడ్డి ఏపీ తరఫున పలు అంశాలను జలశక్తి శాఖకు వివరించారు. కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై వివరణ ఇచ్చారు. 

విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం నీటిని విచక్షణ రహితంగా వాడుతోందని ఆరోపించారు. ముఖ్యంగా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి వాడకానికి తెలంగాణ ప్రభుత్వానికి ఓ పరిమితి అంటూ లేకుండా పోయిందని కేంద్రానికి వివరించారు. శ్రీశైలం డ్యామ్ నుంచి విద్యుదుత్పత్తి కోసం విడుదల చేసిన నీటిని మళ్లీ నాగార్జునసాగర్ నుంచి సాగుకు వాడుకుంటున్నారని తెలిపారు. ఇలా రెండు విధాలుగా తెలంగాణ ప్రయోజనం పొందుతోందని వివరించారు.

ఏపీ వాడుకోవాల్సిన నీటిని తెలంగాణ వాడుకుంటోందని పేర్కొన్నారు. ఏపీ వాటా నీటిని శ్రీశైలం నుంచి వాడుకునే పరిస్థితి ఉండడంలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ చేతుల్లో ఉండగా, ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ తీసేసుకుందని సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడివైపు భాగం ఏపీ భూభాగంలోనే ఉందని, ఆ భాగాన్ని కూడా తెలంగాణ తన అధీనంలోకి తీసుకుందని ఆరోపించారు. నీటి విడుదల కోసం తెలంగాణకు విజ్ఞప్తులు చేయాల్సి వస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, నాగార్జునసాగర్ వద్ద ఏపీ భూభాగంలోని కుడి వైపు ప్రాంతాన్ని తాము అధీనంలోకి తీసుకుంటామని సీఎస్ కేంద్ర జలశక్తి శాఖకు వివరించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనల మేరకే నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. 

కృష్ణా నదీ ప్రాజెక్టులపై రాష్ట్రాల పరిధిని కేఆర్ఎంబీ నిర్ణయించాలని జవహర్ రెడ్డి కోరారు. అప్పటి వరకు నాగార్జున సాగర్ వద్ద పోలీసులను మోహరిస్తామని వెల్లడించారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు తాము గతంలోనే అంగీకరించామని, కానీ ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు. 

తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు అవసరం అని ఇండెంట్ ఇచ్చామని, ఏపీ ఇండెంట్ పై కేఆర్ఎంబీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాగర్ నుంచి నీటి నిలుపుదలకు అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబరు 6న ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరవుతామని వెల్లడించారు.


More Telugu News