నాగార్జునసాగర్ సాక్షిగా జగన్ ఆడిన జగన్నాటకం ఇది: ధూళిపాళ్ల నరేంద్ర

  • నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ధూళిపాళ్ల ప్రెస్ మీట్
  • అర్ధరాత్రి డ్రామాలు దేనికోసమంటూ సీఎం జగన్ కు ప్రశ్న
  • స్వీయ ప్రయోజనాల కోసమేనా అంటూ ఆగ్రహం
  • ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీత
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కంటితుడుపు చర్యగా కూడా కేంద్రానికి లేఖ రాయని జగన్ రెడ్డి హఠాత్తుగా రైతుల కోసమే దండయాత్ర చేశానని చెప్పడం ప్రజల్ని మోసగించడమేనని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ పై వందలాది పోలీసులతో జగన్ రెడ్డి చేయించిన దండయాత్ర రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేక స్వీయ రాజకీయ స్వప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ధూళిపాళ్ల మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలనే తపన, తాపత్రయం నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డిలో ఏ కోశానా కనిపించలేదని ధూళిపాళ్ల విమర్శించారు. డెల్టా రైతాంగం నీళ్లులేక రోడ్లెక్కి ఆందోళనలు చేసినా... చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టినప్పుడు కూడా స్పందించని జగన్ రెడ్డి... తెలంగాణలో ఎన్నికలు జరిగే ముందు రోజు... రాత్రికి రాత్రి తన పోలీసు సైన్యాన్ని సాగర్ డ్యామ్ పైకి పంపి వీరంగం వేయించడం ఎంతటి దిగజారుడుతనమో ప్రజలే ఆలోచించాలన్నారు. 

ఇప్పుడు ఎన్నికల సమయంలో జగన్ నీటి వివాదం రాజేయడం... విడిపోయినా కలిసుంటున్న తెలుగువారి మధ్య చిచ్చురేపడంలో భాగమా? అని ప్రశ్నించారు. సమసిపోయిన ప్రాంతీయ విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకున్న తన రాజకీయ వ్యూహంలో భాగమా? అనేది జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. 

"23 మంది లోక్ సభ సభ్యుల్ని ఉంచుకొని కూడా ఏనాడూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై జగన్ రెడ్డి మాట్లాడింది లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకొని ఉంటే... ఏపీ ప్రభుత్వం తరఫున జగన్ రెడ్డి ఒక్క లేఖ కూడా ఎందుకు కేంద్రానికి రాయలేదు? వాస్తవంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నోసార్లు శ్రీశైలంలో నీటిని వాడుకుంది. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు జగన్ రెడ్డి తన అభ్యంతరం తెలిపాడు?

జగన్ రెడ్డికి తన ప్రయోజనాలు, తన కేసుల మాఫీ తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవనడానికి నాలుగున్నరేళ్లుగా కృష్ణాజలాల విషయంలో అనుసరించిన తీరే నిదర్శనం. అనేక సందర్భాల్లో ఏమీ పట్టనట్టు మౌనంగా ఉన్న జగన్ రెడ్డి... కావాలనే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో జగన్నాటకం మొదలెట్టాడు. రాష్ట్ర రైతాంగం తనను, తన ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధమైందని తెలిసే... జగన్ రెడ్డి  ప్రాజెక్టులపై అర్ధరాత్రి డ్రామాలు మొదలుపెట్టాడు. 

నిజంగా జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇరురాష్ట్రాల నీటి కేటాయింపులపై పునఃసమీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాక కోర్టుకు వెళ్లడమేంటి? అసలు అలాంటి చర్చ వచ్చినప్పుడే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి తన అభ్యంతరం ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నిస్తున్నాం. 

పలుమార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జగన్ రెడ్డి... నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ... తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై జగన్ రెడ్డి ఏనాడూ ఎందుకు నోరుమెదపలేదు?" అంటూ ధూళిపాళ్ల నిప్పులు చెరిగారు.


More Telugu News